పుత్రోత్సాహం – పుత్రోత్పాతం

0
57
మనస్సాక్షి  – 1019
వెంకటేశానికి చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అసలు తనేంటీ… తనకిలా పిలుపు రావడం ఏంటీ… అనుకున్నాడు. ఆ పిలు పొచ్చింది ఎక్కడ్నుంచో కాదు. సాక్షాత్తూ ఉత్తరప్రదేశ్‌ శ్రీవారి నుంచి… అదే… సీఎం అఖిలేష్‌ నుంచి. నిజం చెప్పాలంటే అఖి లేష్‌కీ, వెంకటేశానికీ రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు లేవు. అంతకు ముందు సివిల్స్‌కి ప్రిపేరయ్యే టైంలో ఢిల్లీలో కొంతకాలం ఒకే చోట ఉన్నారంతే. అప్పుడే యిద్దరిమధ్యా ఫ్రెండ్‌ షిప్‌ బాగా పెరిగింది. అయితే ఆ సివిల్స్‌ ఏవో కొట్టు కుండానే అఖిలేష్‌ అటు యూపీ రాజ కీయాల్లోకి వెళ్ళిపోవడం, వెంకటేశం యిటు గిరీశంగారి దగ్గరకొచ్చెయ్యడం జరిగి పోయింది. అయితే అప్పటి పరిచయం లోనే వెంకటేశంలోని చాణుక్య తెలివితేటల్ని అఖిలేష్‌ పట్టెయ్య గలిగాడు. అందుకే యిన్నాళ్ళకి వెంకటేశాన్ని అర్జంటుగా రమ్మని కబురు పంపిం చింది. యింకేముంది… వెంకటేశం ఆరోజే లక్నో బయల్దేరాడు.

——-

అఖిలేష్‌ నివాసంలో… వెంకటేశం రావడం చూసి అఖిలేష్‌ చాలా ఆనందపడ్డాడు. మిత్రులిద్దరూ కొంచెంసేపు పాత విషయాలు మాట్లాడుకున్నారు. అయితే అఖిలేష్‌ మాటల్లో కొంచెం వేదాంత ధోరణి తొంగిచూస్తోంది. యింతలోనే యిద్దరూ విషయంలోకి రానే వచ్చేశారు. వెంకటేశం నవ్వుతూనే ”భాయ్‌… అయితే మొత్తా నికి రాజకీయాల్లో దున్నేస్తున్నావన్నమాట” అన్నాడు. దాంతో అఖి లేష్‌ వేదాంతిలా నిట్టూర్చి ”ఆ… అదంతా బయటికి కనిపించేది. నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టు చూశాడు. దాంతో అఖిలేష్‌ వివరంగా చెప్పడం మొద లెట్టాడు. ”ఏం లేదు భాయ్‌… ఎలక్షన్స్‌లో సీట్ల కోసం అయిదారు రెట్ల మంది పీక్కుతినేస్తున్నారు. యిది కాకుండా అసలు సమస్య మా నాన్న వైపుంది. ఆయన తమ్ముడూ, మా సవతి తల్లీ వాళ్ళ తాలూకా వాళ్ళూ ఆయన్ని ఆడించేస్తున్నారు. నాలాంటి పరిస్థితే ఆయనదీనూ. దాంతో ఆయనా ఎవరికీ సీట్ల విషయంలో ఏం చెప్పలేక నలిగిపోతున్నారు. మేం ఈ సీట్ల సర్ధుబాటు సరిగ్గా చెయ్యలేకపోతే ఆ సీటు రాని వాళ్ళు పార్టీని నాశనం చేసేస్తారు. ఏం చెయ్యాలో తోచడం లేదు” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. చివరికి తనకొచ్చిన ఓ గొప్ప ఆలోచనేదో చెప్పాడు. అది వినగానే అంతటి అఖిలేష్‌ కూడా అదిరిపోయాడు. అంత ేకాదు.. ఆరోజే వెంకటేశం చెప్పింది అమలు చేసే పనిలో పడ్డాడు.

——-

వారం తర్వాత… ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనాలు మొద లయ్యాయి. ములాయం ఓ 525 మంది అభ్యర్ధుల పేర్ల జాబితా ఒకటి విడుదల చేశాడు. ఆపాటికి అఖిలేష్‌ విదేశీ పర్యటనలో ఉన్నాడు. అయితే ఆ జాబితాలో అఖిలేష్‌ ప్రభుత్వంలోని మంత్రులు గానీ, యితరత్రా సన్నిహితులుగానీ లేరు. దాంతో ములాయం వర్గం ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఎంతయినా పెద్దాయన పెద్దాయనే అని తెగ ముచ్చటపడిపోయారు. యిదేదో అఖిలేష్‌ వర్గానికి పెద్ద షాక్‌ యిచ్చింది. ఈలోగా అఖిలేష్‌ విదేశీ పర్యటన నుంచి అర్జంటుగా తిరిగొచ్చేశాడు. తన వర్గం వాళ్ళతో సమాలోచనలు జరిపాడు. అంతేకాదు. అప్పటికప్పుడే 325 మంది తన వాళ్ళ పేర్లతో జాబితా ఒకటి విడుదల చేసేశాడు. దాంతో వాతావరణం యింకా వేడెక్కింది. ఈసారి ములాయం తర్వాత ఎత్తువేశాడు. అఖిలేష్‌నీ, రాంగోపాల్‌నీ ఆరేళ్ళపాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి పారేశాడు. దాంతో అందరిలో ఆసక్తి యింకా పెరిగిపోయింది. యింకోపక్క మాయావతి లాంటోళ్ళు ఏ అవకాశం వస్తుందా అని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. యిలా జరగడం అఖిలేష్‌ వర్గానికి షాకే. దాంతో అఖిలేష్‌ తన వర్గంతో సమాలోచనలు మొదలుపెట్టాడు. అంతేకాకుండా సొంత పార్టీ పెట్టుకోవచ్చనే వార్తలూ బయటకొచ్చాయి. ఈలోగా ములాయం తను సీట్లిచ్చిన వాళ్ళందరికీ సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే వాళ్ళలో యిదివరకటి ఉత్సాహం లేదు. కొంచెం ఆందోళన కనిపిస్తోంది. యింతలో వారిలో అజాం ”సార్‌… అఖిలేష్‌నీ, రాంగోపాల్‌నీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం మంచిది కాదనిపిస్తుంది. ఎందుకంటారా.. పార్టీలో గానీ ప్రజల్లో గానీ మీకెంత బలముందో దాదాపు అంతే బలం అఖిలేష్‌ బాబుకీ ఉంది.  యిప్పుడు అఖిలేష్‌ బయటికిపోతే దాదాపు సగం ఓట్లు చీలిపోతాయి. మధ్యలో ఏ మాయావతి లాంటి వాళ్ళకో అవకాశం యిచ్చి నట్టవుతుంది” అన్నాడు.  అజాం చెప్పిందానికి దాదాపు అందరూ ఒప్పేసుకున్నారు. అయినా ములాయం దిగలేదు. ”లేదు…లేదు.. నాకు పార్టీ సంక్షేమమే ముఖ్యం. లేకపోతే నా మాటని ఎదిరించి యింకో లిస్ట్‌ ప్రకటిస్తాడా…” అన్నాడు కోపంగా. దాంతో అజాం సహా అంతా మళ్ళీ బ్రతిమాలాడారు. దాంతో ములాయం బెట్టువీడినట్టుగా ”సరేలే… సస్పెన్షన్‌ ఎత్తేస్తున్నా. అఖిలేష్‌ని రమ్మని చెప్పండి” అన్నాడు. దాంతో అంతా ఊపిరి  పీల్చుకున్నారు. మొత్తానికి యింకో గంటలోనే ఆ సమావేశానికి అఖిలేష్‌ తన వాళ్ళతో వచ్చేశాడు. అజాం తండ్రీకొడుకులిద్దరి మధ్యా సయోధ్య కుదిర్చేశాడు. చివరికి యిద్దరు విడుదల చేసిన జాబితాల్లో అందరిలోనూ గెలివగలిగే సత్తా ఉన్న వాళ్ళకే సీటిద్దాంలే అన్న నిర్ణయానికి వచ్చేశారు. దీనికి అందరూ ఒప్పుకున్నారు. అక్కడితో సమావేశం ముగిసింది.
——
”అదోయ్‌… రాత్రి నాకొచ్చిన కల..” అన్నాడు గిరీశం తీరిగ్గా చుట్ట అంటించుకుంటూ. దాంతో వెంకటేశం ”అయితే కొత్త సంవత్సరం పూట తీరిగ్గా పడుకుని యిలాంటి కలలు కంటున్నారన్నమాట” అన్నాడు. గిరీశం తలూపి ”ఆ… చెప్పడం మరిచా. ములాయం మళ్ళీ అఖిలేష్‌ వర్గంలో కొందరిపై వేటు వేసేశాడు. దాంతో రాం గోపాల్‌ ఏకంగా ములాయం స్థానంలో అఖిలేష్‌ని జాతీయస్థాయి పార్టీ అధ్యక్షుడిని చేసి పారేశాడు. తర్వాత ఎవరిమీద ఎవరు వేటు వేసుకుంటారో చూడవలసిందే. సరే… యిప్పుడు నీకో ప్రశ్న. యింతకీ నా కలలో నువ్విచ్చిన అంత గొప్ప చాణుక్య సలహా ఏంటంటావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం ”అసలిదంతా అందర్నీ కంట్రోల్‌ చేయడానికో, తమ పార్టీని కాపాడుకోడానికో తండ్రీ కొడుకులు ఆడుతున్న డ్రామా కావచ్చును. అందుకే ఈ సస్పెన్షన్‌ డ్రామాలు. నిజం చెప్పాలంటే ములాయంగానీ, అఖి లేష్‌ గానీ యిద్దరూ పార్టీలో బలమయిన శక్తులే. యిద్దరిలో ఎవరు బయటికిపోయినా పార్టీ మనుగడ కష్టమే. అయితే యిక్కడ ములాయం చేసిన తప్పేంటంటే పార్టీ అంతటినీ బంధువర్గంతో నింపెయ్యడం. యింకోపక్క అఖిలేష్‌ పార్టీలో బలమయిన శక్తిగా ఎదిగాడు. పార్టీలో ఎమ్మెల్యేలందరి మద్దతూ తనకే ఉంది. దాంతో ములాయం వర్గం తమ స్వార్థం కోసం అఖిలేష్‌నీ, ఆ వర్గాన్నీ అణగదొక్కేయాలని చూస్తుంది. దాంతో ములాయం మీద ఒత్తిడి పెంచేస్తున్నారు. అయితే ములాయం మనసులో ‘పార్టీ బాగుంటే చాలు… తన కొడుకు బాగుంటే చాలు’ అన్న ఆలోచన ఉండొచ్చు. అందుకే తండ్రీకొడుకులిద్దరూ ఈ ఉత్తుత్తి తుపాను సృష్టించి ఉండొచ్చు. ఉండకపోవచ్చును. అయితే అసల యిన ట్విస్ట్‌ ఏంటంటే యిలాంటి పిల్ల చేష్టల వలన పబ్లిక్‌లో పార్టీ గ్రాఫ్‌ పడిపోయి మొత్తం పార్టీకే ఎసరు రావచ్చు” అంటూ తేల్చాడు. యిదేదో కరెక్టే అయి ఉండొచ్చన్నట్టుగా గిరీశం తలూపి యింకో చుట్టంటించుకున్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి