పెద్ద నోట్లు రద్దు చేసి సాధించింది ఏమిటి?

0
116
మోడీ సర్కార్‌:కు యువజన కాంగ్రెస్‌ ప్రశ్న
రాజమహేంద్రవరం, జనవరి 5 : ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధాని నరేంద్రమోడీ ఏం సాధించారని జాతీయ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి, ఎపి ఇన్‌ఛార్జి వూట్ల వరప్రసాద్‌  ప్రశ్నించారు. మోడీ తీసుకున్న నిర్ణయంపై అఖిల భారత కాంగ్రెస్‌ ఐదు ప్రశ్నలు సంధించిందని, దీనిపై మోడీ ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. టిటిడి కళ్యాణ మండపం రోడ్‌లోని నగర కాంగ్రెస్‌ కార్యాలయంలో ఈరోజు యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ నాయకులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం వెలికి తీశారో చెప్పాలన్నారు. ఆయన నిర్ణయం వల్ల ఆర్థికంగా ఎంత నష్టం వాటిల్లిందో, ఎంతమంది ఉపాధి కోల్పోయారో, ఎంతమంది చనిపోయారో చెప్పాలన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తేదీకి ఆరునెలల ముందు నుంచి రూ.25 లక్షల పైన డిపాజిట్లు చేసిన వారి వివరాలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతు ధరపై 20 శాతం అదనంగా ఇవ్వాలని, చౌక దుకాణాల ద్వారా సగం ధరకే సరుకులు పంపిణీ చేయాలని కోరారు. తమ ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పే వరకు ఉద్యమిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాకేష్‌ రెడ్డి, రాజారావు, కార్యదర్శి అర్షద్‌, నగర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు భేరి మోహిత్‌, ఎం.డి.ఉస్మాన్‌, నరాల చందు, పట్టాభి, తదితరులు పాల్గొన్నారు.