చర్యల నివేదిక ఏదీ? -రైతు బజార్‌ పునరుద్ధరణ ఏమైంది ?

0
104
మున్సిపల్‌ కాలనీ గ్రౌండ్‌ను క్రీడా మైదానంగా అభివృద్ధికి చర్యలేవీ?
ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసిన గన్ని కృష్ణ
ప్రజాప్రతినిధులు గొలుసుకట్టగా రావడంపై అసంతృప్తి
42 వ డివిజన్‌లో వినూత్నంగా సాగిన జన్మభూమి – మా వూరు
రాజమహేంద్రవరం, జనవరి 5 :  ” మార్కెట్‌యార్డ్‌ ప్రాంగణంలో రైతు బజారు పునరుద్ధరణ  హామీ ఏమైంది?…మున్సిపల్‌ కాలనీలోని గ్రౌండ్‌ చుట్టూ ప్రహరీ నిర్మించి క్రీడా మైదానంగా అభివృద్ధి చేయడంలో జాప్యం ఎందుకు?…గత జన్మభూమిలో ప్రజల ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదిక (ఏటీఆర్‌) ఏదీ?…. శీతాకాలం దృష్ట్యా వెలుగు వచ్చే వరకు  అంటే కనీసం 6-15 గంటలవరకైనా వీధిలైట్లను వాకర్స్‌, దినచర్యకు  వెళ్ళేవారి సౌకర్యార్ధం ఆర్పివేయకుండా ఉంచాలని చెప్పినా వినరా? ఇవన్నీ  ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడో?, ప్రజాప్రతినిధో? సంధించిన ప్రశ్నలనుకుంటున్నారా?  అయితే మీరు పొరపడినట్టే. స్ధానిక 42 వ డివిజన్‌లో సీజీటీఎం కళాశాల వద్ద ఈరోజు ఉదయం జరిగిన జన్మభూమి – మా వూరు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ  కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ కాసేపు ప్రతిపక్ష పాత్ర పోషించి అధికారులను నిలదీసిన ప్రశ్నలివి.  నైతిక విలువలకు కట్టుబడి పార్టీ నాయకుని హోదాలో అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన వేదికపై ఆసీనులు కాకుండా వేదిక దిగువన ఉంటూ వస్తున్న గన్ని కృష్ణ ఈరోజు తాను నివశిస్తున్న 42 వ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌కు సంబంధించి జన్మభూమి కార్యక్రమానికి హాజరై అధికారులు ఆహ్వానించినా సున్నితంగానే తిరస్కరించి సాధారణ పౌరునిలా వేదిక దిగువనే కూర్చుని సమస్యలపై అధికారులను నిలదీశారు. సీఎం చంద్రబాబునాయుడు రోజుకు 18 గంటలు కష్టపడుతుండగా తదనుగుణంగా మనం పనిచేస్తున్నామా? అని అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని గన్ని కృష్ణ సూచించారు. ఇదే సందర్భంలో స్ధానిక ప్రజాప్రతినిధుల తీరుపై కూడా గన్ని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్ధానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఉండగా ఒక్కరూ కూడా  జన్మభూమి గ్రామసభకు సకాలంలో రాకపోవడంపై ఆయన నిష్టూరమాడారు. గ్రూప్‌ ఫోటోలకు దిగినట్లుగా అంతా ఒకే చోటకు కాకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఒక్కొక్క చోటికి ఒక్కొక్కరు వెళితే అధికారుల్లో జవాబుదారితనం, ప్రజల్లో విశ్వాసం కలుగుతాయని, అయితే అంతా గొలుసుకట్టగా ఒకేచోటకు వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గన్ని నిర్మోహమాటంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయానికంటే గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైనా ప్రజాప్రతినిధులు సకాలంలో రాకపోవడం సరికాదన్నారు. గన్ని అలా మాట్లాడుతున్న సమయంలోనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. జన్మభూమి గ్రామసభల్లో తమ సమస్యలకు ఓ పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలు వస్తారని, అయితే వారి ఆశలపై నీల్లు జల్లకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మానస పుత్రిక అయిన జన్మభూమి కార్యక్రమంపై వారికి విశ్వాసం కల్పించవలసిన అవసరం ఉందని గన్ని ఆవేశంగా అన్నారు. ఐదు డివిజన్లకు సంబంధించి ప్రజలకు సౌకర్యంగా మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలో  గతంలో ఉన్న రైతు బజార్‌ను పునరుద్ధరించాలని చాలా కాలంగా కోరుతున్నా అది కార్యరూపం దాల్చడం లేదని, ఐదు డివిజన్ల కార్పొరేటర్లు, ప్రజలు సంతకాలు చేసినా దానికి ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఈ విషయాన్ని గతంలో వ్యవసాయ,మార్కెటింగ్‌ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్ళినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని గన్ని ఆవేదనతో పాటు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే జన్మభూమి నాటికి రైతుబజార్‌ పునరుద్ధరణ జరగకపోతే మార్కెట్‌యార్డ్‌ను స్తంభింపజేస్తామని గన్ని అధికారులను హెచ్చరించారు. అలాగే మున్సిపల్‌ కాలనీ గ్రౌండ్స్‌ను క్రీడా మైదానంగా అభివృద్ధి చేయడానికి న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని అధికారులు అవాస్తవాలు చెబుతున్నారని, ఈ విషయాన్ని తాను  సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెలుసుకుంటానని గన్ని కృష్ణ తెలిపారు. ఈ స్ధలంలో పార్కు నిర్మాణం కంటే క్రీడా మైదానంగా అభివృద్ధి చేస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు.  గతంలో జన్మభూమిలో యాక్షన్‌ టేకన్‌ రిపోర్ట్‌లు చదివి వినిపించేవారని, ఈ పర్యాయం ఆ సంప్రదాయాన్ని ఎందుకు పాటించలేదని గన్ని ప్రశ్నించారు. ఏటీఆర్‌ లేకుంటే జన్మభూమి వ్యర్ధమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆశయాలు, విధానాలను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు కష్టపడుతున్నా కొందరు అధికారుల వ్యవహారశైలి వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. జన్మభూమి గ్రామసభలో మేయర్‌ పంతం రజనీ శేషసాయి సింగపూర్‌, మలేషియా విధానాలను ప్రస్తావించినపుడు అక్కడకు ఇక్కడకు చాలా వ్యత్యాసం ఉంటుందని, అవన్నీ ఇక్కడ అమలు జరగాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని గన్ని  వ్యాఖ్యానించారు. గన్ని కృష్ణకు ముందు ప్రసంగించిన ఆ డివిజన్‌ కార్పొరేటర్‌  మళ్ళ నాగలక్ష్మీ కూడా  అధికారుల తీరుపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. కాళీ స్పెషల్‌ మున్సిపల్‌ పాఠశాలలో విద్యార్ధులకు బెంచీలు ఏర్పాటు చేయాలని,  మున్సిపల్‌ కాలనీ మైదానాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను కోరుతున్నా సత్వర స్పందన  లేదన్నారు.  తమ డివిజన్‌లో సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ  ఆమె పలు అంశాలను ప్రస్తావించారు.