పార్టీలో వేప పువ్వులు

0
73
మనస్సాక్షి  – 1020
చదవేస్తే  ఉన్న మతిపోయిందంటారు. యిదేదో ఎవరి విషయంలోనో అనుకుంటే పొరబాటే. ఎడాపెడా బోల్డన్ని చదువులు చదివిన వెంకటేశం విషయంలో…! అసలు సమస్యలంతా కొత్త సంవత్సరంలో మొద లయింది. కొత్త సంవత్సరం మొదలయిన తర్వాత ఎవరయినా యింటికొచ్చిన వాళ్ళకి స్వీటో, ఫ్రూటో పెట్టడం పద్ధతి. అయితే వెంకటేశం పద్ధతే కొంచెం తేడాగా ఉంది. యింటికి వచ్చినోళ్ళకి యివేవీ కాకుండా అదేదో పధార్థంలాంటిది చేతిలో పోస్తు న్నాడు. ఆ వచ్చినోళ్ళు ‘యిదేంటీ’ అని అడగలేక నోటిలో వేసుకుంటే ఆ రుచేదో రకరకాలుగా ఉంటుందాయె. కొంచెం తియ్యగానూ, కొంచెం చేదుగానూ, యింకొం చెం పుల్లగానూ కలగలసి ఉంటుంది. అక్కడికీ ఒకళ్ళిద్దరు ‘ఏంటోయ్‌ వెంకటేశం.. యిదేదో ఉగాది పచ్చడిలా ఉంది. మరి అదేదో ఉగాది నాడు పెట్ట కుండా యిలా ఆంగ్ల సంవత్సరాదినాడు పెట్టావేం… పోనీ అలా పెట్టావే అనుకుందాం. అప్పుడందులో ఈ చేదూ, పులపూ, వగరూలాంటివి లేకుండా శుభ్రంగా తియ్యగా ఉండేలా పెడితే ఎంత బాగుంటుందని…’ అన్నారు. దాంతో ఏం చెప్పాలో తోచక వెంకటేశం తలపట్టుకున్నాడు.
——–
”అది గురూగారూ… నాకలాంటి గమ్మత్తయిన కలొ చ్చిందనుకోండి. అయినా యింగ్లీషు సంవత్సరాదికి ఉగాది పచ్చడి పెట్టడ మేంటంట.. ఈ లెక్కన నిజంగానే చదవేస్తే  ఉన్న మతిపోయి నట్టంటారా?” అన్నాడు వెంకటేశం. ఆపాటికి అరుగుమీద సెటిల యిన గిరీశం ఓ చుట్ట అంటించుకుని ”అలాగెందు కనుకోవాలంట… ఓ పక్కన తెలుగుకి ప్రాధాన్యత తగ్గి పోతుందని గోలెక్కువయిపోయింది కదా. అందుకే మనం బాగా హడావిడిగా చేసుకునే ఆంగ్ల సంవత్స రాదినాడు తెలుగు సాంప్రదాయ పచ్చడి… అదే… ఉగాది పచ్చడి పెడితే తప్పేంలేదు. దాంతో మన తెలుగుకి ఎంతో కొంత ప్రాధాన్యత పెంచి నట్టవుతుంది” అన్నాడు. వెంకటేశం తలూపి ”ఆ…యింకో సమ స్యుంది గురూగారూ… కొత్త సంవత్సరం పూట ఆ పులుపూ, చేదూ లాంటివేంటి? శుభ్రంగా తీపిగా ఉండేలా ఆ పచ్చ డేదో పెట్టొచ్చుకదాని కలలో అంతా వాయించి పారేశారు” అన్నాడు. దాంతో గిరీశం ”సరే… ఈ వారం ప్రశ్నేదో దీని మీదే లాగించేద్దాం. ఆ పెట్టేదేదో పులుపు, తీపి, వగరు, చేదులాంటివన్నీ కలగలిపింది పెడితేనే బెస్ట్‌. అంతేగానీ వొట్టి తీపి ఉన్నదయితే అది బొత్తిగా బావోదు. దీన్ని కొంచెం రాజకీయాలకి అన్వయించి చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచించి, అప్పుడు చిన్న ఊహలాంటిది చెప్పడం మొదలెట్టాడు..
——–
మోదీ గారి నివాసం… ఫోన్‌ రింగయింది. యిప్పుడు ఫోనొచ్చిన నంబరయితే  చాలా కొద్దిమందికే తెలుసు. అంత ముఖ్యమయిన నంబరది. యింతకీ అవత ల్నుంచి ఫోన్‌ చేసింది ప్రధానికి అత్యంత ఆప్తుడైన అమిత్‌షా. మోదీ ఫోనెత్తగానే ”వేసెయ్యనా?” అన్నాడు. దాంతో మోడీ కంగారుపడిపోయి ”యిప్పుడు అలాం టివేంవద్దు” అంటూ గట్టిగా చెప్పేసి ఫోన్‌ కట్‌ చేసేశాడు. యిది జరిగిన రెండువారాలకి మళ్ళీ దాదాపు యిలాంటి ఫోనే వచ్చింది. అవతల్నుంచి మళ్ళీ ”వేసెయ్యనా?” అంటూ వినిపించింది. దాంతో మళ్ళీ అసహ నంగా ”ఏంటి వేసేసేది? వేసెయ్య డానికి యిదేదో పవన్‌ కళ్యాణ్‌ సినిమానో, మహేష్‌బాబు సినిమానో కాదు. పార్టీ…” అన్నాడు. దాంతో అవతల్నుంచి అమిత్‌షా… అలాగంటే ఎలా? వేటు వెయ్యక పోతే ఎలా కుదురుద్దని… రెండు వారాల నాడు ఆ సుబ్ర హ్మణ్యస్వామి మీద వేటువేసి పార్టీలోంచి పంపేద్దామంటే వొద్దన్నారు. యిప్పుడు సాక్షి మహరాజ్‌ మీద వేటు వేద్దామన్నా వొద్దంటున్నారు. వీళ్ళిద్దరి నోటి దురుసు వలనా చాలా సమస్య లొస్తున్నాయి. వీళ్ళ వ్యాఖ్యల వలన బయట చాలా గొడవగా ఉంటుంది. పార్టీకి అది మంచిది కాదు” అన్నాడు. దాంతో మోదీ ”లేదు… లేదు.. వాళ్ళు ఉండాలి. ఉండి తీరాలి. అది మన పార్టీకే మంచిది” అంటూ ఎలా అనేది చెప్పడం మొదలెట్టాడు…
——-
”అది గురూగారూ… చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం విసుక్కుని ”మీతాత వెంకటేశంలాగ యిలా అరా కొరా వ్యవహారాలు చేస్తావేంటంట? కొంచెం వివరంగా చెప్పు” అన్నాడు. దాంతో వెంక టేశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”మరేం లేదు గురూగారూ… ఏం పార్టీలో అయినా ‘రాముడు మంచి బాలుడు’ టైపులో అందరూ ఉండకూడదు. అలా ఉంటే ఆ పార్టీ ఉనికి గానీ, గమనం గానీ స్థబ్దుగా ఉండిపోతుంది. అంటే దానర్థం పార్టీ అనేది ఉగాది పచ్చడిలో రుచుల్లో భిన్నమయిన తరహాలో స్పందించే వ్యక్తులతో నిండి ఉండాలి. అంటే సాత్విక నాయకులతోపాటు ఈ సుబ్రహ్మణ్యస్వామి, సాక్షి మహరాజ్‌ లాంటి వాళ్ళతో అన్నమాట. యిలాంటివాళ్ళు ఏ అంశమయినా హద్దులు దాటి మాట్లాడతారు. అప్పుడది వివాదాలకి దారితీస్తుంది. ఆ వెంటనే పార్టీలో ఉండే వాజ్‌పేయిలాంటి పెద్దాయన ‘అబ్బే…అలా చేయడం తప్పు’ అన్నట్టుగా ఆ ప్రభావాన్ని తగ్గించే పనిలో పడతాడు. ఈలోగా ఈ అంశంగా ప్రతిపక్షాలు తమ శైలిలో విరుచుకుపడతాయి. యిక అప్పుడు అధిష్టానం నుంచి ఎవరో ఒకరు ‘ఎవరు హద్దులు దాటి మాట్లాడినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అలాంటి స్టేట్‌మెంట్లు యిస్తారు. ఈలోగా వాళ్ళ వ్యాఖ్యల వలన పబ్లిక్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో గమనించొచ్చు. దానికను గుణంగా వ్యూహాలు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఏతావాతా చెప్పేదేంటంటే… ఏ పార్టీ అయినా ఉగాది పచ్చడిలా అన్ని రకాల రుచులతో నిండి ఉండాలి…అదే… అన్ని రకాల నాయకులతో నిండి ఉండాలి. అప్పుడే ఆ పార్టీ ఉత్తేజపూరితంగా నడుస్తుంది. అలా కాకుండా మొత్తం పార్టీ అంతా సాత్వికజనాలతో నిండిపోతే అదేదో బెల్లం పానకం తాగే అనుభూతినిచ్చే ఉగాది పచ్చడిలాగే ఉంటుంది” అంటూ వివరించాడు. గిరీశం తలూపి ”ఉగాది పచ్చడిలాగే నీ సమాధానంలో రకరకాల షేడ్స్‌ కనిపిస్తున్నా యోయ్‌”అంటూ యింకో చుట్ట అంటించుకున్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి